Sri Vijaya Rama Gajapathi |
Sri Alak Narayana Gajapathi |
Dr. P.V.G.Raju |
Sri Chaganti Ganga Babu |
చరిత్రనూరు వసంతాల ఘన చరిత్ర కలిగిన విజయనగర సంగీత, నృత్య కళాశాల 1919వ సంవత్సరం ఫిబ్రవరి 5న ఆనాటి విజయనగర సంస్థానాదీసులైన అభినవభోజులు మహారాజా నాల్గవ పూసపాటి విజయరామ గజపతులు వారిచే అప్పటి తమ సంస్థానంలో దివానుగా పనిచేయుచున్న చాగంటి జోగారావు పంతులు గారి కుమారుడు చాగంటి గంగబాబు పుట్టుకతో అంధుడని తెలుసుకొని అతని భవిష్యత్తు ఎలా అనే ఆలోచనలో పుట్టినదే ఇప్పటి ప్రసిద్ది చెందిన మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిగా కోటకు దగ్గరలో సువిశాల ప్రాంగణం కలిగిన (అప్పటికి టౌన్ హాల్ గా పిలవబడే) భవనంలో విజయరామ గాన పాఠశాలగా ప్రారంబించబడినది. విద్యా పోషకులుగా పేరెన్నికగన్న విజయనగర రాజులు సంగీతములోను, నృత్యములోను భారత దేశంలో పేరెన్నిక కలిగిన విద్యార్ధులను తీర్చిదిద్దెందుకు ఈ కళాశాలను స్థాపించిరి. అందుకు తగ్గట్టుగానే ఆయా కళలందు ఉద్దండులైన మహా పురుషులు ఈ కళాశాలకు అధ్యక్షత వహించి కళాశాలను భారతంలోనే అగ్రపీఠాన నిలబెట్టేరు. వీరిలో కళాశాల ప్రప్రధమ అధ్యక్షులు హరికధా పితామహ శ్రీ మదజ్జాడ అధిభట్ల నారాయణదాసు గారు, పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు మొదలైన గురుశ్రేష్టుల శిష్యప్రశిష్య పరంపర ద్వారా కళాశాల కీర్తి నేటికీ విస్తరిస్తూనే ఉంది.స్వాతంత్ర్యానంతర కాలంలో వచ్చిన మార్పుల కనుగుణంగా సంస్కృతి ప్రాధాన్యత కలిగిన ఈ కళాశాలను శ్రీ విజయరామ గజపతులు తరువాత శ్రీ అలక్ నారాయణ గజపతులు మరియు శ్రీ పి.వి.జి.రాజు గార్ల హయాంలో 1955వ సంవత్సరం ఆగష్టు 15న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలోకి వెళ్ళి వివిధ శాఖల అధీనంలో నడిచి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, పొట్టి శ్రీరాములు తెలుగు యునివర్సిటి అనుబంద సంస్థగా నడుస్తున్నది.సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు, పద్మభూషణ్ డా||శ్రీ నూకల చినసత్యనారాయణ గారు, శ్రీ మారెళ్ళ కేశవరావు గారు, శ్రీ ఇవటూరి విజయేశ్వర రావు గారు, శ్రీ కొమండురి క్రిష్ణమాచార్యులు గారు, శ్రీ వాసా వారు, శ్రీమతి ఐతం అప్పలరాజు గారు, కుమారి మండా మాణిక్యం గారు, ద్వారం రమణ కుమారి గారు, శ్రీ ద్వారం సత్యన్నారాయణ గారు, శ్రీ సాలూరి రాజేశ్వర రావు గారు, శ్రీ సాలూరి హనుమంత రావు గారు, శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు గారు, శ్రీమతి పి.సుశీల గారు, శ్రీ అశ్వద్ధామ గారు, శ్రీ సుసర్ల దక్షిణాన మూర్తి గారు, వంటి ఎందరో మహానుభావులు కళాశాలలో సంగీత విద్య నేర్చుకుని తమ ప్రతిభతో దేశవిదేశాలలో కీర్తినార్జించి, మన కళాశాల ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసి, నేటితరం విద్వాంసులకు, విద్యార్ధులకు ఆదర్సకులైనారు |